: కరీనా కపూర్ తో ఛత్తీస్ గడ్ సీఎం సెల్ఫీ... విమర్శలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్


బీజేపీ సీనియర్ నేత రమణ్ సింగ్ ఛత్తీస్ గఢ్ కు ముఖ్యమంత్రి. పాలనలో సత్తా ఉన్న నేతగా పేరుగాంచిన ఆయన ఆ రాష్ట్రానికి తొలి సీఎంగానే కాక వరుసగా మూడో దఫా సీఎంగా ఎన్నికయ్యారు. 2003 నుంచి ఆయన ఆ రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతూ వస్తున్నారు. నక్సల్స్ పై ఉక్కుపాదం మోపిన ఆయన తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రమణ్ సింగ్ చేసిన ఓ చిన్న పని ఆయనను చిక్కుల్లోకి నెట్టింది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో నిన్న ఆ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ ల ఆధ్వర్యంలో బాలల హక్కులపై జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రత్యేక అతిథిగా హాజరైంది. కార్యక్రమం అంతా సాఫీగానే సాగిపోయింది. మరికాసేపట్లో కార్యక్రమం ముగుస్తుందనగా... రమణ్ సింగ్ తన స్మార్ట్ ఫోన్ చేతబట్టి కరీనా కపూర్ తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ దృశ్యం మీడియా కంటికి చిక్కిపోయింది. అంతే, విపక్షం కాంగ్రెస్ పార్టీ ఆయనపై విరుచుకుపడింది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే పట్టించుకోని సీఎం, సినీ తారలతో సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆక్షేపించింది. అయినా సీఎం స్థాయిలో వ్యక్తి చేసే పనేనా ఇది? అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరి ఈ ఆరోపణలపై రమణ్ సింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News