: చంద్రబాబు ‘లీడర్’ సీఎం!... సీఎంఓ అధికారికి బర్త్ డే గ్రీటింగ్స్!
మూవీ మొఘల్ రామానాయుడు మనవడు దగ్గుబాటి రానా తెరంగేట్రం చేసిన చిత్రం ‘లీడర్’ గుర్తుందిగా. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రానా, తన కార్యాలయం (సీఎంఓ)లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి బర్త్ డే తెలుసుకుని ఆమెకు బొకేతో జన్మదిన శుభాకాంక్షలు చెబుతాడు. తనలాంటి చిన్న ఉద్యోగి బర్త్ డే తెలుసుకుని సీఎం స్థాయి వ్యక్తి గ్రీటింగ్స్ చెప్పడంతో సదరు ఉద్యోగి ఉద్వేగానికి గురవుతుంది. సరిగ్గా అలాంటి సన్నివేశమే నిజ జీవితంలో నిన్న విజయవాడలోని సీఎం గెస్ట్ హౌస్ లో కనిపించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సతీశ్ చంద్ర సీఎంఓ కార్యదర్శిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న సతీశ్ చంద్ర గతంలోనూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నిన్న సతీశ్ చంద్ర బర్త్ డే. అయితే విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే సతీశ్ చంద్ర, బర్త్ డే అయినా నిన్న విధులకు మాత్రం గైర్హాజరు కాలేదు. రోజులాగే నిన్న కూడా ఆయన తన విధి నిర్వహణలో భాగంగా సీఎం గెస్ట్ హౌస్ కు వచ్చారు. అయితే సతీశ్ చంద్ర బర్త్ డే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు ఆయనను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సతీశ్ చంద్రను తన దగ్గరికి పిలిపించుకున్న చంద్రబాబు ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు. అంతేకాక ప్రత్యేకంగా స్వీట్లు తెప్పించి సతీశ్ చంద్ర నోటిని తీపి చేశారు.