: బీహార్ కీలక శాఖలన్నీ ఆర్జేడీకే!... హోంశాఖను అట్టిపెట్టుకున్న నితీశ్


ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అత్యధిక సీట్లను గెలుచుకుంది. సీఎంగా నిన్న పదవీ బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్ పార్టీ జనతాదళ్ (యునైటెడ్) కంటే కూడా ఆర్జేడీ 9 సీట్లు అదనంగా 80 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇరు పార్టీలు చెరో 101 స్థానాల్లో బరిలోకి దిగగా, ఆర్జేడీ 80 సీట్లలో గెలిస్తే, జేడీయూ 71 సీట్లతో సరిపెట్టుకుంది. వెరసి ఆర్జేడీ బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో పెద్ద పార్టీని తన మంత్రివర్గంలో చేర్చుకున్న నితీశ్ కుమార్ ఆ పార్టీకి డిప్యూటీ సీఎం పోస్టు కట్టబెట్టారు. అంతేకాదు, కీలక శాఖలను కూడా ఆయన ఆర్జేడీ ఎమ్మెల్యేలకే కేటాయించారు. డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేసిన లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ కు రోడ్లు, భవనాల శాఖను నితీశ్ కుమార్ కేటాయించారు. ఇక లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ ను కూడా తమ మంత్రివర్గంలో చేర్చుకున్న నితీశ్ అతడికి మరో కీలక శాఖ వైద్య, ఆరోగ్య శాఖను అప్పజెప్పారు. ఇక కేబినెట్ లోనే అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను కూడా ఆర్జేడీకే కేటాయించారు. ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బరీ సిద్ధిఖీ బీహార్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే, మరో కీలక శాఖ అయిన హోం మినిస్ట్రీని మాత్రం నితీశ్ తన వద్దే ఉంచుకున్నారు.

  • Loading...

More Telugu News