: మాలి ఉగ్రకలకలం పూర్తి కథనం!
మాలి ఉగ్ర కలకలంపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫ్రాన్స్ బలగాలు బమాకో బయల్దేరేందుకు సిద్ధమయ్యాయి. ఉగ్రవాదులపై కసి తీర్చుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సమాయత్తం అవుతున్నాయి. నేటి ఉదయం ఎవరి పనుల్లో వారు ఉండగా, డిప్లొమాటిక్ లైసెన్స్ ఉన్న కారులో మాస్కులు ధరించిన పది నుంచి 13 మంది ఉగ్రవాదులు హోటల్ రాడిసన్ బ్లూకు దూసుకువచ్చారు. హోటల్ గేటు వద్ద వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. వెంటనే కారుదిగిన ఓ ఉగ్రవాది అక్కడున్న ముగ్గురు సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అనంతరం బారికేడ్లను తోసుకుంటూ హోటల్ లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి సిబ్బంది సహా, పలు రూంలలో ఉన్న అతిథులందర్నీ తీసుకుని 7వ అంతస్తుకు వెళ్లారు. ఇంతలో హోటల్ లో ఇతర చోట్ల ఉన్నవారు ఉగ్రవాదులకు చిక్కకుండా తప్పించుకోగలిగారు. 170 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉగ్రవాదులు ఖురాన్ లో పంక్తులు చెప్పినందుకు బహుమానంగా 80 మందిని విడుదల చేశారు. సుదీర్ఘ ఎదురు కాల్పుల అనంతరం భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా కాల్పులు జరుపుతూ, హోటల్ లోకి ప్రవేశించారు. ప్రతిఘటిస్తున్న ఉగ్రవాదులపైకి ఎదురు కాల్పులు జరుపుతూ, పలువురు బందీలను విడిపిస్తున్నారు. తాజాగా ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న 20 మంది భారతీయులను భద్రతా బలగాలు విముక్తి కల్పించినట్టు సమాచారం. దాడులు జరిపిన ఉగ్రవాదులు తప్పించుకోకుండా పోలీసులు హోటల్ నుంచి బయటకు దారితీసే అన్ని మార్గాలను దిగ్బంధించారు. తాజా పరిస్థితిపై ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు సమీక్ష నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.