: మాలి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్
వెస్ట్ ఆఫ్రికాలోని మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్ లో ఉగ్రవాదుల దాడిని ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరాన్ తెలిపారు. లండన్ లో ఆయన మాట్లాడుతూ, బమాకోలోని రాడిసన్ బ్లూ హోటల్ లోని ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య పోరు జరుగుతోందని అన్నారు. మాలిలో ఉన్న తమ సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ఆయన చెప్పారు. ఆపరేషన్ జరుగుతుండడంతో ఆ వివరాలు వెల్లడించలేమని ఆయన తెలిపారు. కాగా, ఈ ఘటనలో టర్కీకి చెందిన ముగ్గురు ఎయిర్ లైన్స్ ఉద్యోగులు సురక్షితంగా తప్పించుకున్నారు. మరో నలుగురు సహచరులు హోటల్ లోనే ఉండిపోయినట్టు వారు చెబుతున్నారు. కాగా, రాడిసన్ బ్లూ హోటల్ లో చొరబడిన ఉగ్రవాదులు 170 మందిని బందీలుగా తీసుకుని 80 మందిని వదిలేసినట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. మిగిలిన 80 మందిని విడిపించేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.