: రాజయ్య కోడలు సారిక, పిల్లల ఆత్మహత్యల కేసులో ఇతర నేతల ప్రమేయంపై సీబీఐకి ఫిర్యాదు
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, మనవళ్ల ఆత్మహత్య కేసులో ఇతర రాజకీయ నేతల ప్రమేయంపై ఆమనగల్ కు చెందిన న్యాయవాది జి.నర్సింహ కోఠీలోని సీబీఐ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. సిరిసిల్ల రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం టికెట్ ఖరారు చేసిన తరువాత నామినేషన్ కు ముందు రాత్రి జరిగిన ఈ ఘటనలో విద్రోహ కోణం ఉందని, దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని ఆయన పేర్కొన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని భావించిన మరో వ్యక్తిపై అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. స్థానికత అంశం కారణంగా తనకు బీ-ఫారం ఇవ్వని పక్షంలో, ఢిల్లీలో పలుకుబడి ఉపయోగించి తన అల్లుడికి టికెట్ ఇప్పించుకోవాలని ఆయన చూశారని ఆయన వెల్లడించారు. అధిష్ఠానం రాజయ్యకే టికెట్ ఖరారు చేయడంతో ఆయన ఈ దారుణానికి ఒడిగట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజయ్య రాజకీయ జీవితానికి ముగింపు పలికి తన మద్దతు పెంచుకునేందుకు ఆయన ఈ దారుణానికి ఒడిగట్టే అవకాశం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సారిక ఆత్మహత్య కేసు నుంచి రాజయ్యను తప్పించే ఆలోచన తనకు లేదని, అయితే ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి తెచ్చేందుకు సీబీఐ దర్యాప్తు కోరుతున్నానని ఆయన తెలిపారు.