: కూతుర్ని కిడ్నాప్ చేశారని 14 ఏళ్ల క్రితం కేసు, కట్ చేస్తే... అల్లుడయ్యాడు!
2001, డిసెంబర్... తన 17 ఏళ్ల కుమార్తె మీనాక్షిని, రాజేశ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని అశోక్ వర్మ అనే వ్యక్తి కేసు పెట్టాడు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని ఎంతగా విచారించినా మీనాక్షి ఆచూకీ బయటపడలేదు. రాజేశ్ ను పట్టిస్తే రూ. 50 వేల బహుమతిని ఇస్తామని ప్రకటించారు కూడా. కట్ చేస్తే, ఢిల్లీలోని ఓ కోర్టు... ఇద్దరు భార్యాభర్తలు చెరోవైపున నిలుచున్నారు. వారిద్దరినీ మాట్లాడుకోవడానికి కూడా అనుమతించలేదు. వారి పదేళ్ల కుమారుడు బయట ఆడుకుంటున్నాడు. అంతకు ఐదు రోజుల క్రితం, ఈ నెల 14న అమృతసర్ మార్కెట్లో సాధారణ తనిఖీల్లో భాగంగా రాజేశ్ ను ప్రశ్నించగా, తాము 14 ఏళ్లుగా వెతుకుతున్న కిడ్నాపర్ అతనే అని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ముందు రాజేశ్ ను ప్రవేశపెట్టగా, మీనాక్షి స్టేట్ మెంట్ ఇచ్చింది. తాము ప్రేమించుకున్నామని, పెద్దలు ఇష్టపడని కారణంగానే పారిపోయాయని తెలిపింది. తామెంతో అన్యోన్యంగా ఉంటున్నామని కూడా చెప్పింది. ఆమె మాటలు విన్న న్యాయమూర్తి రాజేశ్ కు వెంటనే బెయిల్ మంజూరు చేశారు. ఇక కోర్టులోనే ఉన్న మీనాక్షి తండ్రి కుమార్తె, అల్లుడు, మనవళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో వీరి ప్రేమకథకు శుభం కార్డు పడినట్లయింది.