: సరిహద్దులు మూసేస్తున్న యూరప్... ఎటెళ్లాలో తెలియక శరణార్థుల గగ్గోలు!
శరణార్థుల ముసుగులో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జొరబడుతున్నారన్న అనుమానాలతో యూరప్ దేశాలు తమ సరిహద్దులను మూసి వేస్తున్నాయి. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ తదితర దేశాల నుంచి వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. దీంతో ఎటు వెళ్లాలో తెలియక శరణార్థులు గగ్గోలు పెడుతున్నారు. రాత్రికి రాత్రి నాలుగు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మొరాకో, శ్రీలంక, సూడాన్, లైబీరియా కాంగో, పాకిస్థాన్ దేశాల నుంచి గ్రీస్ చేరి అక్కడి నుంచి మేసిడోనియాలోకి వెళ్లాలని వచ్చిన వారిని ఆ దేశం అడ్డుకుందని ఐరాస హెచ్ఆర్సీ ప్రతినిధి మెలీటా సన్జిక్ వ్యాఖ్యానించారు. మేసిడోనియా, సెర్బియా సరిహద్దులో, సిరియా, ఆఫ్ఘన్, ఇరాక్ నుంచి వచ్చిన వారికి మాత్రమే సెర్బియాలోకి ప్రవేశం లభిస్తోందని; క్రొయేషియా, సెర్బియా సరిహద్దులో ఈ మూడు దేశాలతో పాటు పాలస్తీనా వాసులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారని ఆమె వివరించారు. ఇక ఆ పక్కనే ఉండే సాల్వేనియా వలసదారులను ఎవరినీ తమ దేశంలోకి రానివ్వరాదని నిర్ణయించుకుంది. మొరాకో నుంచి 162 మంది శరణార్థులు అటు సాల్వేనియాకు వెళ్లలేక, ఇటు క్రొయేషియా రానివ్వక సరిహద్దుల్లో అవస్థలు పడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని యూరప్ దేశాలు వలసగా వస్తున్న వారిని అడ్డుకుంటాయని తెలుస్తోంది.