: కన్న బిడ్డలను కొడితే జైలు శిక్ష... ఇండియాలో కొత్తగా రానున్న చట్టం వివరాలివి!
చిన్నారుల సంరక్షణ, వారి హక్కులను కాపాడే దిశగా ఇండియాలో ఓ కొత్త చట్టం రూపుదిద్దుకుంటోంది. ప్రతిపాదిత చట్టంలో విద్యార్థుల, చిన్నారుల రక్షణకు ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. ఇందులో భాగంగా, తమ పిల్లలను కొట్టిన తల్లిదండ్రులకూ శిక్షలు తప్పవు. క్రమశిక్షణ పేరుతో పిల్లలను కొట్టడాన్ని ఈ కొత్త చట్టం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తొలిసారిగా నేరం చేస్తే ఆరు నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలు విధిస్తారు. ఇక రెండోసారి పిల్లలను కొట్టి పట్టుబడితే, మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల వరకూ జరిమానా, అదే వ్యక్తి మూడవ సారి పట్టుబడితే, ఐదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. విచారణలో భాగంగా ఏదైనా స్కూలు లేదా కాలేజి హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్ సహకరించకుంటే, అతనికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధించవచ్చని కూడా చట్టం ప్రతిపాదనల్లో ఉంది. ఇక చిన్నారులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తే, ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టం మారుతోంది. కాగా, కొట్టడం వల్ల తండ్రులు, బిడ్డల మధ్య అనుబంధం దూరమై, వారు హింసా ప్రవృత్తికి దగ్గరవుతారని ఒకవైపు కేంద్రం వాదిస్తున్నప్పటికీ, ఈ చట్టంపై మరోవైపు విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. పిల్లను కొట్టకుండా, తిట్టకుండా వారు చేస్తున్న పనులన్నీ సమర్ధిస్తూ పోతే మారుతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.