: అత్యాచార బాధితురాలిని అవమానించిన యూపీ మంత్రి ఆజంఖాన్


ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ, నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ మరోసారి తన నైజాన్ని బైట పెట్టుకున్నారు. అత్యాచారానికి గురై, న్యాయం కోసం తన వద్దకు వచ్చిన ఓ బాధితురాలిని చులకనగా మాట్లాడాడు. ఈ రోజు 'గంగా కి పుకార్' అనే కార్యక్రమంలో ఆజంఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, తనకు న్యాయం చేయాలని కోరుతూ అత్యాచార బాధితురాలు మంత్రికి వినతి పత్రం అందజేసింది. ఈ క్రమంలో, మంత్రి స్థాయిలో ఉండి బాధితురాలికి న్యాయం చేయాల్సిన ఆజంఖాన్ మాత్రం ఆమెపై ఒంటికాలిపై లేచారు. "పబ్లిసిటీ కోసం పాకులాడొద్దు. నీకు జరిగిన అవమానంతో అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తావా? లేకపోతే గౌరవంగా పోరాడుతావా?" అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. దీంతో, బాధితురాలు సహా, అక్కడున్న వారు కూడా అవాక్కయ్యారు. అనంతరం, బాధితురాలు మాట్లాడుతూ... న్యాయం చేయమని వేడుకోవడానికి వస్తే, అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. జూలై 27వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ... వారు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలి లాయర్ తెలిపారు. మరోవైపు, ఆజంఖాన్ వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత లక్ష్మీకాంత్ బాజ్ పాయ్ తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News