: బాలీవుడ్ నటితో అండర్ వరల్డ్ డాన్ ప్రేమాయణం, పెళ్లి... వారి కొడుకు బెంగళూరులో ఉన్నాడట!
1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ గా పేరుగాంచిన అంతర్జాతీయ స్థాయి నేరగాడు దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్ లో సురక్షితంగా ఉన్నాడు. భారత్ లో వరుస పేలుళ్లలో వందలాది మందిని పొట్టనబెట్టుకున్న ఆ కరుడుగట్టిన ఉగ్రవాది భారత్ లో ఉండగా బాలీవుడ్ ను తన కనుసైగలతో శాసించాడు. ఈ క్రమంలో అతడు బాలీవుడ్ అందాల సుందరి మందాకిని (సింహాసనం ఫేం)తో ప్రేమాయణం నడిపినట్లు గతంలో పుకార్లు షికారు చేశాయి. ఈ ప్రేమాయణం పెళ్లి పీటల దాకా వెళ్లిందని కూడా నాడు వార్తలు వినిపించాయి. ఆ వార్తలు నిజమన్న కోణంలో మాజీ పోలీస్ బాస్ నీరజ్ కుమార్ తాజాగా రాసిన పుస్తకం ‘డయల్ డి ఫర్ డాన్’ పలు సంచలన విషయాలను వెల్లడి చేసేలానే ఉంది. ఈ పుస్తకం రేపు మార్కెట్లోకి విడుదల కానుంది. సీబీఐ డిప్యూటీ డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన నీరజ్ కుమార్ తాను మూడు సార్లు దావూద్ ఇబ్రహీంతో మాట్లాడినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన పుస్తకం రిలీజ్ కు ముందు నేటి ఉదయం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. దావూద్, మందాకినీలకు ఓ కొడుకు ఉన్నాడని నీరజ్ కుమార్ చెప్పారు. దావూద్ పాకిస్థాన్ పారిపోగా, మందాకిని మాత్రం ముంబైలోనే ఉండిపోయిందని, ఆ తర్వాత ఆమె కూడా దుబాయి వెళ్లిందని ఆయన చెప్పారు. దావూద్, మందాకినిలకు ఓ కొడుకు కూడా ఉన్నాడని, అతడు ప్రస్తుతం బెంగళూరులోని మందాకిని సోదరి ఇంటిలో పెరుగుతున్నాడని కూడా నీరజ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం నీరజ్ వెల్లడించలేదు. నీరజ్ తాజా ప్రకటనతో రేపు విడుదల కానున్న పుస్తకంలో ఏఏ సంచలనాత్మక అంశాలు ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది.