: గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అట్టర్ ఫ్లాప్... పెట్టుబడిగా వచ్చింది 400 గ్రాములు మాత్రమే!
ప్రధాని నరేంద్ర మోదీ రెండు వారాల క్రితం ప్రారంభించిన గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజల నుంచి ఈ స్కీమ్ కు బొత్తిగా స్పందన కనిపించలేదు. దేశంలో సుమారు 20,000 టన్నుల బంగారం ఉందని ప్రభుత్వం అంచనా వేసి, దాని నుంచి 30 శాతంగా 6 వేల టన్నుల బంగారాన్ని పెట్టుబడుల రూపంలో ఆకర్షించాలని కేంద్రం భావించగా, ఇప్పటి వరకూ కేవలం 400 గ్రాముల బంగారమే డిపాజిట్ అయింది. జెమ్స్ అండ్ జ్యూయలరీ ఎగుమతి ప్రోత్సాహక కౌన్సిల్ చైర్మన్ అనిల్ సంఖ్ వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల వద్ద, ఆలయాల్లో పేరుకుపోయిన బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి దానిపై ఇంతకు ముందు లేని విధంగా ఆకర్షణీయమైన వడ్డీని పొందవచ్చని ఆ స్కీమ్ ప్రారంభం సందర్భంగా మోదీ తెలిపారు. అంతేకాదు, ప్రభుత్వం బంగారం ఆధారిత బాండ్ల రూపంలో పేపర్ గోల్డ్ పథకాన్ని సైతం ప్రారంభించింది. ఆర్థిక శాఖ అధికారులతో సమావేశానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'ఇంతవరకూ 400 గ్రాముల బంగారమే డిపాజిట్ అయింది. మోదీ సర్కారు ఈ పథకాన్ని పునస్సమీక్షించాలని నిర్ణయించింది. బంగారాన్ని పరీక్షించేందుకు, దానిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మరిన్ని కేంద్రాలు తెరిచేందుకు నిర్ణయించింది' అని వివరించారు.