: ఒక్క మాత్రతో సూపర్ ఫైటర్లుగా మారుతున్నారు... ఐఎస్ఐఎస్ దూకుడుకు కారణమిదే!
సిరియా... ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల పుట్టినిల్లు. అక్కడున్న వారిలో అత్యధికులు మాజీ అల్ ఖైదా ఉగ్రవాదులు, ఇరాక్ లోని కరుడుగట్టిన నేరస్తులు, అరబ్ జీహాదీలు, పశ్చిమ దేశాల నుంచి తరలివెళ్లినవారు. ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్నది వారి కృత నిశ్చయం. అందుకు ఎంచుకున్న మార్గం మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. ప్రాణాలు పోతాయని తెలిసినా, దూసుకెళ్లేలా వారి మనసును రాయిగా మారుస్తున్నది ఏంటో తెలుసా? ఓ చిన్న మాత్ర. దాని పేరు కాప్టాగాన్! ఫెనేతిలైన్ అనే సింథటిక్ డ్రగ్ నుంచి తీసిన శక్తిమంతమైన ఆంఫెటామైన్ ఉపయోగించి కాప్టాగాన్ తయారు చేస్తారు. దీన్ని తీసుకుంటే రోజుల తరబడి వారు బండరాయిలుగా మారిపోతారు. నిద్రాహారాలు లేకున్నా నిలిచి పోరాడుతారు. వారిని ఎవరూ ఆపలేరు. తమను ఎవరూ ఎదిరించలేరన్న ధైర్యం వారిలో పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిషేధంలో ఉన్న ఈ మాత్రలు సిరియా, ఇరాక్ దేశాల్లో బహిరంగంగా లభిస్తాయి. వీటిని ఎవరు, ఎక్కడ తయారు చేస్తున్నారన్నది దూరంగా ఉండి చెప్పలేమని యూఎస్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రతినిధి మసూద్ కరిమిపూర్ వ్యాఖ్యానించారు. 1960 ప్రాంతం నుంచి కాప్టాగాన్ మార్కెట్లో లభిస్తుండగా, 1980 నాటికి చాలా దేశాలు దీనిని నిషేధించాయి. "ఈ మాత్రలు నేను తీసుకున్నాను. ఈ ప్రపంచమే నా కాళ్ల కింద ఉన్న భావన కలుగుతుంది. అది చాలా మంచి అనుభూతి. ఏమైనా చేసేయొచ్చనిపిస్తుంది" అని పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఓ లెబనాన్ జాతీయుడితో కాప్టాగాన్ వాడకంపై చేసిన ఇంటర్వ్యూను బీబీసీ ప్రసారం చేసింది.