: లెఫ్టిస్టుల వల్లే బీహార్ లో బీజేపీకి 10 సీట్లు అదనంగా వచ్చాయి: కేరళ సీఎం విశ్లేషణ


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ బీహార్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తీరు బీజేపీ నేతలకు పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. గణాంకాలు సహా ఆయన చెబుతున్న విశ్లేషణ వామపక్షాలకు కూడా చెంప చెళ్లుమనిపిస్తోంది. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ బరిలో ఘోర పరాజయం బీజేపీకి మింగుడు పటడం లేదు. ఖాతా తెరుద్దామనుకున్న వామపక్షాలు ఎప్పటిలానే పేలవ ప్రదర్శనతో నీరసించాయి. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి నేడు పాట్నా వెళ్లనున్న చాందీ నిన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. బీహార్ బరిలో 220 మంది అభ్యర్థులను బరిలోకి దింపిన వామపక్షాలు 10 మంది బీజేపీ ఎమ్మెల్యేల గెలుపునకు దోహదం చేశాయని చాందీ వ్యాఖ్యానించారు. వామపక్షాల అభ్యర్థులే లేకుంటే, బీజేపీకి మరో పది సీట్లలో పరాజయం తప్పేది కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఓ పది నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప మార్జిన్లతో విజయం సాధించారని, ఈ మెజారిటీ వామపక్షాల అభ్యర్థులకు పోలైన ఓట్ల కంటే తక్కువగా ఉందని ఆయన చెప్పారు. దీంతో ఆయా స్థానాల్లో వామపక్షాల అభ్యర్థులు లేకుంటే, ఆ సీట్లను కూడా మహా కూటమి అభ్యర్థులే గెలుచుకునేవారని చాందీ పేర్కొన్నారు. ఓట్లను చీల్చిన వామపక్షాలు బీజేపీ అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News