: నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్న శిద్ధా!... 24 గంటల్లో ‘వరద గోతు’ల పూడ్చివేత


బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం కారణంగా వెల్లువెత్తిన తుపాను దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమను అతలాకుతలం చేసింది. ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలను ముంచెత్తిన తుపాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై మాత్రం పెను ప్రభావాన్ని చూపింది. రోజుల తరబడి కురిసిన తుపాను కారణంగా నెల్లూరు నగరంతో పాటు జిల్లా మొత్తం నీట మునిగింది. కోల్ కతా నుంచి చెన్నైకి దారి తీసే జాతీయ రహదారి ఎక్కడికక్కడ కోతలకు గురైంది. రహదారిపై ఏర్పడ్డ భారీ గోతుల కారణంగా మూడు రోజుల పాటు రెండు నగరాల మధ్య దాదాపుగా రాకపోకలు స్తంభించాయి. మొన్న సాయంత్రానికి తుపాను కాస్తంత తగ్గుముఖం పట్టగానే ఏపీ రవాణా శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్ చార్జీ మంత్రి శిద్ధా రాఘవరావు రంగంలోకి దిగారు. నిన్న ఉదయమే కార్యరంగంలోకి దిగిన ఆయన నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నారు. మంత్రి ఆదేశాలతో మొన్న రాత్రి నుంచే అధికార యంత్రాంగం జాతీయ రహదారిపైకి వచ్చేసింది. నిన్న ఉదయం మంత్రి కూడా తమతో జత కలవడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. సాయంత్రంలోగానే జాతీయ రహదారిపై ఏర్పడ్డ గోతులన్నీ కనుమరుగయ్యాయి. అందుబాటులో ఉన్న వాహనాలు, కూలీలను రంగంలోకి దించిన మంత్రి యుద్ధ ప్రాతిపదికన రహదారిపై పడిన గోతులను పూడ్చివేయించారు. నిన్న సాయంత్రానికి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పున:ప్రారంభం కావడంతో మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. వాహనాల రాకపోకలు ప్రారంభమైన తర్వాత కాని మంత్రి అక్కడి నుంచి కదలలేదు.

  • Loading...

More Telugu News