: ఇక పుత్రరత్నాల వంతు!... నితీశ్ కేబినెట్ లో ‘లాలూ’ జూనియర్స్!


బీహార్ ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా కూడా వ్యవహరించిన రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్టైలే వేరు. అప్పటిదాకా నష్టాల బాటలో అలసి సొలసినట్లు ప్రయాణం సాగిస్తున్న భారతీయ రైల్వేలను సుదీర్ఘ కాలం తర్వాత లాభాల్లోకి తేవడమే కాక లక్షలాది మంది కార్మికులు పనిచేస్తున్న ఆ సంస్థకు కొత్త జవసత్వాలను నింపారు. దేశీయంగా మేనేజ్ మెంట్ విద్యలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలుగా పేరొందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్లలోనే కాక ప్రపంచంలోనే పేరొందిన వార్టన్ స్కూల్ లాంటి సంస్థల పాఠ్యాంశాల్లోనూ ఆయన హాట్ టాపిక్ గా మారారు. అయితే, బీహార్ సీఎంగా ఉండగా వెలుగు చూసిన దాణా కుంభకోణంలో దోషిగా తేలిన తర్వాత లాలూ రాజకీయ జీవితం దాదాపుగా ముగిసిపోయింది. అయితేనేం, లాలూ జూనియర్స్ రంగంలోకి దిగేశారు. ఇటీవల ముగిసిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ కుమారులు తేజస్వీ ప్రసాద్, తేజ్ ప్రతాప్ లు రాజకీయ అరంగేట్రం చేశారు. రఘోపూర్ నుంచి తేజస్వీ, మహువా నుంచి తేజ్ ప్రతాప్ లు ఘన విజయం సాధించారు. తాజాగా నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్ కుమార్ కేబినెట్లో వారిద్దరూ మంత్రులుగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. తద్వారా పిన్న వయసులోనే మంత్రి పదవులు చేపడుతూ వారిద్దరూ రికార్డు పుటలకెక్కనున్నారు. ఇక వీరిద్దరిలో ఒకరికి బీహార్ డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అరంగేట్రంలోనే సత్తా చాటిన వీరిద్దరూ భవిష్యత్తులో బీహార్ లో కీలక నేతలుగా ఎదిగే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News