: తూటాలకు ఎదురొడ్డి కుమారుడ్ని కాపాడిన తల్లి!
ఐఎస్ఐఎస్ దాడి అనుభవాలు పారిస్ వాసులను నిద్రపోనివ్వడం లేదు. తన స్నేహితురాలు చేసిన త్యాగాన్ని సిహెమ్ సుయిద్ అనే మహిళ మీడియాతో పంచుకుని కంటతడిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే... నవంబర్ 13న తల్లి పాట్రీషియాను, కుమారుడు లూయిస్ ను తీసుకుని ఎల్సా అనే మహిళ బతక్లాన్ థియేటర్ లో 'ఈగిల్స్ ఆఫ్ డెత్' షో చూసేందుకు వెళ్లింది. షో ప్రారంభమైన కాసేపటికే ఉగ్రవాదులు బతక్లాన్ థియేటర్ లో ప్రవేశించారు. కనిపించిన వారిని కనిపించినట్టే పిట్టల్లా కాల్చేస్తున్నారు. ఎవరినీ వదలడం లేదు. దీనిని క్షణాల్లో గుర్తించిన ఎల్సా ఉన్నపళంగా కుమారుడ్ని కిందికి తోసి, అతడిపై పడుకుండిపోయింది. తీవ్రవాదులు నేరుగా ఎల్సా, పాట్రీషియాలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉగ్రవాదుల ఆటకట్టించారు. ఎవరైనా బతికి ఉన్నారేమోనన్న ఆశతో వెతికినా పోలీసులకు తల్లి శవం కింద ప్రాణాలతో ఉన్న లూయిస్ కనిపించాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు లూయిస్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని వివరిస్తూ సుయిద్ స్థానిక మీడియాలో ఓ వ్యాసం రాసింది.