: మీ అక్కను, నన్ను చంపేస్తుంటే...ఏం చేస్తున్నార్రా?: అనుచరులతో కఠారి మోహన్ చివరి మాటలు!


సొంత మేనల్లుడి చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ చిత్తూరు జిల్లా కీలక నేత కఠారి మోహన్ దాడి నుంచి తనను, తన భార్యను రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. నిన్న కఠారి దంపతుల మృతదేహాలకు నివాళి అర్పించేందుకు చిత్తూరు వెళ్లిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు కఠారి అనుచరులు దాడిని పూసగుచ్చినట్లు వివరించారు. చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గా ఉన్న తన భార్య అనురాధతో కలిసి మోహన్ మరికొంతమంది కార్పొరేటర్లతో చర్చల్లో మునిగి ఉన్నారు. ఈ సమయంలో బురఖాలు ధరించి మేయర్ చాంబర్ లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడికి దిగారు. ఈ సందర్భంగా కఠారి మేనల్లుడు చింటూ రాయల్ (చంద్రశేఖర్) నేరుగా అనురాధ వద్దకు వెళ్లగా, టేబుల్ కు మరో వైపు కూర్చున్న మోహన్ వేగంగానే స్పందించారు. అయితే బురఖాతో వచ్చిన మరో వ్యక్తి కత్తి దూయటంతో దాని నుంచి తప్పించుకుని వారిపై మోహన్ ఎదురుదాడి చేసేలోగానే అనురాధపై కాల్పులు జరిగిపోయాయి. చేతిలో ఆయుధం లేకపోవడం, అనుచర వర్గం బయట ఉండటంతో మోహన్ బయటకు పరుగులు పెట్టే యత్నం చేశారు. అదే సమయంలో చింటూ తన మేనమామ మోహన్ పైనా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మోహన్ కడుపులోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. అయినా మోహన్ బయటకు వెళ్లే యత్నం చేయగా కత్తి చేతబట్టిన వ్యక్తి ఆయనను అడ్డుకున్నాడు. అతడిని తోసేసుకుని మోహన్ బయటకు పరుగెత్తారు. ఈ సమయంలో తనకు సమీపంగా ఉన్న కుర్చీలను తీసుకుని మోహన్ వారిపైకి విసిరారు. వాటి నుంచి తప్పించుకున్న నిందితులు మోహన్ వెంటే బయటకు వచ్చేశారు. బయట ఉన్న మరో ముగ్గురితో కలిసి మొత్తం ఐదుగురు మోహన్ ను చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. నిందితులు వెళ్లిపోగానే కిందపడ్డ మోహన్ వద్దకు ఆయన అనుచరులు పరుగెత్తుకుంటూ వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న మోహన్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ‘‘మీ అక్కను, నన్ను చంపేస్తుంటే, ఏం చేస్తున్నార్రా?’’ అంటూ మోహన్ తన అనుచరులతో అన్నారు. ఇవే తమ నేత చివరి మాటలని చంద్రబాబుకు చెబుతూ ఆయన అనుచరులు కన్నీటి పర్యంతమయ్యారు.

  • Loading...

More Telugu News