: రాందేవ్ బాబాను టార్గెట్ చేసిన కాంగ్రెస్... పతంజలి నూడుల్స్ అక్రమ వ్యాపారమని కామెంట్
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత యోగా గురువుగా ఉన్న బాబా రాందేవ్ ను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన సంగతి తెలిసిందే. అంతేకాక హర్యానా సర్కారీ స్కూళ్లలో యోగా పాఠాల బోధనకు కూడా ఖట్టర్ సర్కారు ఓ అడుగు వేసింది. నాడు ఖట్టర్ పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా పతంజలి నూడుల్స్ వివాదం కేంద్రంగా నేరుగా రాందేవ్ నే టార్గెట్ చేసింది. పతంజలి నూడుల్స్ కు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతులు లేవని నిన్న పలు ఆంగ్ల పత్రికలు వార్తలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే తాము అన్ని అనుమతులు తీసుకున్న మీదటే, నూడుల్స్ విడుదల చేశామని రాందేవ్ నేటి ఉదయం ప్రకటించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కొద్దిసేపటి క్రితం ఘాటు వ్యాఖ్యలు చేశారు. పతంజలి నూడుల్స్ పేరిట రాందేవ్ బాబా అక్రమ వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.