: వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయండి: చంద్రబాబు
ఏపీలోని వరద బాధితులకు నిత్యావసర సరకులను సత్వరంగా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాలైన నెల్లూరు, కడప, చిత్తూరు కలెక్టర్లతో సీఎం ఇవాళ ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చెరువులు, రోడ్లకు పడిన గండ్లను పూడ్చాలని, పంట నష్టంపై త్వరగా నివేదికలు పూర్తిచేసి పంపాలని చెప్పారు. సర్పంచులు, వార్డు కౌన్సెలర్లు, జన్మభూమి కమిటీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పునరావాస చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తానని సీఎం చెప్పారు.