: లోకేశ్ ఏ పదవిలో ఉన్నారని అమరావతి శంకుస్థాపనకు వెళ్లారు?: కల్వకుంట్ల కవిత కామెంట్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత నేటి ఉదయం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో భాగంగా వరంగల్ వచ్చిన ఆమె అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అంశాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో వారసత్వానికి సంబంధించి తన కుటుంబంపై వెల్లువెత్తున్న విపక్షాల దాడికి ప్రతిస్పందించిన కవిత... కాంగ్రెస్ పార్టీకి తల్లి అధ్యక్షురాలైతే, కొడుకు ఉపాధ్యక్షుడుగా లేరా? అని ఆమె ప్రశ్నించారు. తామెప్పుడు నేరుగా పదవులు తీసుకోలేదని, ప్రజల దీవెనలతోనే తమకు పదవులు వచ్చాయని ఆమె స్పష్టం చేశారు. అయినా నారా లోకేశ్ కు ఏ పదవి ఉందని అమరావతి శంకుస్థాపనలో ఉన్నారని కవిత ప్రశ్నించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు భారీ మెజారిటీతో విజయం తథ్యమని కూడా కవిత జోస్యం చెప్పారు.