: న్యూయార్క్ కు వస్తున్నాం... కాచుకోండి!: ఐఎస్ఐఎస్
పారిస్ లో తాము జరిపిన దాడులు విజయవంతమయ్యాయని సంబరాలు చేసుకుంటూ, భవిష్యత్తులో మరింత హింసను సృష్టిస్తామని, తమ తదుపరి టార్గెట్ న్యూయార్కని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఓ వీడియోను విడుదల చేశారు. ఫురాత్ మీడియా సెంటర్ లో ఈ వీడియో విడుదల కాగా, పలువురు ఉగ్రవాదులు అరబిక్, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుకుంటూ, ఒకరిని ఒకరు అభినందించుకుంటున్న దృశ్యాలున్నాయి. ఈ వీడియోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఇటీవలి ప్రసంగంతో పాటు న్యూయార్క్ నగర దృశ్యాలున్నాయి. ఫ్రాన్స్ దాడులు కేవలం ప్రారంభం మాత్రమేనని చెబుతూ, న్యూయార్క్ టైమ్ స్క్వేర్, టూరిస్టులు అధికంగా ఉండే మన్ హటన్ క్రాస్ రోడ్స్ పై భారీ ఎత్తున విరుచుకుపడనున్నట్టు ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం ఆరు నిమిషాల నిడివి వున్న వీడియోలో ఓ సూసైడ్ బాంబర్ తన ఒంటికి ప్రమాదకర పేలుడు పదార్థాలు ధరిస్తున్న దృశ్యాలున్నాయి. తమకు ఈ కొత్త వీడియో గురించి తెలిసిందని అటు ఎఫ్బీఐ, ఇటు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు.