: మేయర్ దంపతుల మర్డర్ స్పాట్ లో చంద్రబాబు... అణువణువూ పరిశీలించిన ఏపీ సీఎం
సొంత జిల్లా చిత్తూరులో తన పార్టీకి చెందిన కీలక నేత కఠారి మోహన్, ఆయన సతీమణి, మేయర్ అనురాధల దారుణ హత్య టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని తీవ్రంగా కలచివేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్ష విలయంపై నిన్న ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు నేరుగా చిత్తూరు వెళ్లారు. పార్టీకి నమ్మిన బంటులుగా పేరుగాంచిన కఠారి దంపతుల మృతదేహాలకు ఆయన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో కఠారి దంపతులు హత్యకు గురైన ప్రదేశాన్ని చంద్రబాబు పరిశీలించారు. మేయర్ గదిలో అనురాధ చనిపోగా, హాలులో మోహన్ కుప్పకూలారు. తొలుత మేయర్ కార్యాలయంలోకి వెళ్లిన చంద్రబాబు అక్కడ జరిగిన దారుణాన్ని కఠారి కుటుంబ సభ్యులు, అనుచరులు చెబుతుంటే ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబు హాలులోకి వెళుతూ అక్కడ పడ్డ రక్తపు మరకలను నిశితంగా పరిశీలించారు. దాదాపుగా పావుగంటకు పైగా ఆయన అక్కడే ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఘటనపై ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు నిందితుల దాడిపై ఆగ్రహోదగ్రులయ్యారు. పట్టపగలు కత్తులు, తుపాకులు చేతబట్టి నేరస్తులు స్వైర విహారం చేస్తుంటే మీరేం చేస్తున్నారని పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలను ఇకపై సహించబోమని తేల్చిచెప్పారు. నిందితులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు.