: చిత్తూరు జిల్లాలో మరో కలకలం...రిటైర్డ్ ప్రిన్సిపల్ అదృశ్యం, ఆచూకీ చెబితే లక్ష ఇస్తామంటున్న కుటుంబం
చిత్తూరులో టీడీపీ కీలక నేత కఠారి మోహన్, ఆయన సతీమణి, మేయర్ అనురాధల హత్య జిల్లాలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో సైతం కలకలం రేపింది. నేటి ఉదయం మరో వార్త ఆ జిల్లాలో ఆందోళనకు తెర తీసింది. జిల్లాలోని ప్రధాన నగరం తిరుపతిలో ఓ వ్యక్తి పది రోజులుగా కనిపించడం లేదు. నగరంలోని ఎన్జీవోస్ కళాశాలకు ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన జయరాంనాయుడు 10 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పది రోజులుగా వెతుకుతున్న కుటుంబ సభ్యులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు జయరాంనాయుడు ఆచూకీ కోసం రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే, జయరాంనాయుడు ఆచూకీ చెబితే లక్ష రూపాయల రివార్డు ఇస్తామంటూ ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త జిల్లాలో కలకలం రేపుతోంది.