: కేసీఆర్ గారూ... మీ ప్రచార కార్యకరగా పనిచేస్తా!: జానారెడ్డి ఆసక్తికర కామెంట్


టీ కాంగ్రెస్ సీనియర్ నేత, టీ అసెంబ్లీలో ఆ పార్టీ నేత కుందూరు జానారెడ్డి నిన్న ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్న వరంగల్ లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతల పేర్లను ప్రస్తావిస్తూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నిన్న టీ కాంగ్ నేతలు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వరంగల్ వేదికగానే మీడియాతో మాట్లాడిన సందర్భంగా జానారెడ్డి ఆసక్తికర కామెంట్ చేసి, కేసీఆర్ కు పెద్ద సవాలే చేశారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలకు మూడేళ్లలో రెండు పంటలకు నీరందిస్తానని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను జానారెడ్డి ప్రస్తావించారు. మూడేళ్లు కాదు కదా, ఐదేళ్లలో అయినా కేసీఆర్ తన మాట నిలుపుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లలో తన హామీ అమలు సాధ్యమేనని కేసీఆర్ అంతర్జాతీయ స్థాయి ఇంజినీరింగ్ నిపుణులతో చెప్పిస్తే, తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని జానారెడ్డి ప్రకటించారు. అంతేకాక కేసీఆర్ కు తాను ప్రచార కార్యకర్తగా పనిచేస్తానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని చెప్పే క్రమంలో జానారెడ్డి ఈ వ్యాఖ్య చేశారు. జానా నోటి వెంట ప్రచార కార్యకర్త పదం విన్న అక్కడి మీడియా ప్రతినిధులు విస్తుపోయారు.

  • Loading...

More Telugu News