: తెల్లవారితే నిశ్చితార్థం... అంతలోనే ముగిసిన జీవితం... నేవీ ఇంజనీర్ విషాదగాథ!


తెల్లవారితే ఆ యువకుడికి వివాహ నిశ్చితార్థం... అయితే, ఆ రాత్రి జరిగిన ప్రమాదంలో అతని జీవితమే పరిసమాప్తమైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం సత్యనారాయణ కాలనీలోని సాయిబాబా ఆలయం సమీపంలో రైల్వే ఉద్యోగి విన్నకోట హరగోపాల్, దమయంతి నివసిస్తున్నారు. వారి కుమారుడు రాజా(26) నేవీ లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. రాజాకు ఇటీవలే పెళ్లి కుదిరింది. బుధవారం ఉదయం నిశ్చితార్థం జరగాల్సి ఉండటంతో ఇంటికి వచ్చాడు. ఆ వేడుకకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకునేందుకని మంగళవారం సాయంత్రం హరగోపాల్, దమయంతి దంపతులు నగరానికి వచ్చారు. ఇంట్లో రాజాతోపాటు అమ్మమ్మ ఉంది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ చెడిపోవడంతో మెకానిక్ ను పిలిపించాడు. ఫ్రిజ్ లో పాడైపోయిన వస్తువు స్థానే కొత్త దానిని కొనేందుకని మెకానిక్ బయటకు వెళ్లాడు. ఈలోగా అమ్మమ్మకు కాఫీ కలిపిద్దామని వంట గదిలోకి వెళ్లిన రాజా గ్యాస్ స్టౌ వెలిగించాడు. క్షణంలో గది నిండా మంటలు వ్యాపించాయి. సిలిండర్ పేలడంతో పాటు, ఆ పక్కనే ఉన్న మరో సిలిండర్ కు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ సిలిండర్ కూడా పేలింది. మంటల్లో చిక్కుకున్న రాజా తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటి బయట కూర్చుని ఉన్న రాజా అమ్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో రాజాను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఒంటి గంట సమయంలో రాజా ప్రాణాలు విడిచాడు. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News