: యూరప్ దెబ్బకు 'బేర్'మన్న ఇండియా!
నేటి స్టాక్ మార్కెట్ సెషన్లో బెంచ్ మార్క్ సూచికలు భారీగా నష్టపోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ క్రితం ముగింపుతో పోలిస్తే నామమాత్రపు నష్టాల్లో స్థిరంగా సాగిన సూచికలు, యూరప్ మార్కెట్ల ప్రారంభం తరువాత ఒక్కసారిగా ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లోని కంపెనీల ఈక్విటీలను విక్రయించి లాభాలను తీసుకుపోయారు. వీరితో పాటు దేశవాళీ సంస్థాగత సంస్థలు సైతం అమ్మకాలకే మొగ్గు చూపడంతో సూచికల నష్టం క్రమంగా పెరిగింది. బుధవారం నాటి సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 381.95 పాయింట్లు పడిపోయి 1.48 శాతం నష్టంతో 25,482.52 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 105.75 పాయింట్లు పడిపోయి 1.35 శాతం నష్టంతో 7,731.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.68 శాతం, స్మాల్ క్యాప్ 0.71 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 11 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. ఐడియా, ఏషియన్ పెయింట్స్, గెయిల్, బీపీసీఎల్, కోల్ ఇండియా తదితర కంపెనీలు లాభపడగా, హిందాల్కో, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వీఈడీఎల్ తదితర కంపెనీలు నష్టపోయాయి. ఈ సెషన్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 96,23,929 కోట్లకు తగ్గింది. మొత్తం 2,845 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,046 కంపెనీలు లాభాలను, 1,615 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. కాగా, యూరప్ మార్కెట్లు ఆరంభంలోనే నష్టాల్లోకి జారగా, సాయంత్రం 4:35 గంటల సమయానికి (భారత కాలమానం ప్రకారం) ఆరంభంలోనే ఎఫ్టీఎస్ఈ 0.40 శాతం, సీఏసీ 1.03 శాతం, డీఏఎక్స్ 0.80 శాతం నష్టాల్లో నడుస్తున్నాయి. అంతకుముందు బుధవారం నాటి సెషన్లో జపాన్ నిక్కీ మినహా మిగతా అన్ని దేశాలూ నష్టాల్లో ముగిశాయి.