: ఫ్రాన్స్ లో ఉదయం నుంచి జరిగిన హైడ్రామా ఇదే!
ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో, గత శుక్రవారం పారిస్ లో జరిగిన ఉగ్రదాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న అబ్దెల్ హమీద్ అబౌద్ (27) హతమయ్యాడు. అంతకుముందు సుమారు 8 గంటల పాటు హైడ్రామా నడిచింది. పారిస్ నుంచి ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు ఆ దేశపు సైన్యం, పోలీసులు, నిఘా వర్గాలు పెద్దఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సాధారణ ప్రజలను సైతం వారి గుర్తింపు కార్డులను చూసి, ధ్రువీకరించుకున్న తరువాతనే వదిలిపెట్టారు. ఈ క్రమంలో పారిస్ శివారుల్లోని సెయింట్ డెనిస్ ప్రాంతంలో భద్రతా దళాలు సోదా చేస్తున్నాయి. ఆ సమయంలో కొందరు ఉగ్రవాదులు అక్కడే తలదాచుకున్నారు. వీరు ఉగ్రవాదులని సోదాలు జరుపుతున్న ఫ్రాన్స్ పోలీసులకు కూడా తెలియదు. ఈలోగా పోలీసులు తమను గమనించారని భావించిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. ఆ సమాచారం క్షణాల్లో ఉన్నతాధికారులకు తెలియగా, భారీ ఎత్తున ఆయుధాలు ధరించిన 100 మందికి పైగా సైన్యం, ఫైరింజన్లు, ఆంబులెన్సులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. తెల్లవారుఝామున ఇది జరుగగా, అప్పటి నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పోలీసులు, ఉగ్రవాదుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఓ పథకం ప్రకారం ఆ ప్రాంతం మ్యాప్, ఉగ్రవాదులు తలదాచుకున్నారని భావిస్తున్న భవనం మ్యాప్ లను తెప్పించుకున్న పోలీసులు మెల్లగా ముందుకు కదిలారు. పోలీసులను చంపడమే టార్గెట్ గా ఉగ్రవాదులు ఓ మహిళా సూసైడ్ బాంబర్ ఉగ్రవాదిని బయటకు వదలగా, ఆమె తనకు తాను పేల్చుకుని మరణించింది. ఆ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదు. ఆపై దూసుకెళ్లిన ఫ్రాన్స్ పోలీసులు ఒక్కొక్కరిగా ఉగ్రవాదులను హతమార్చారు. మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారు. అప్పటికి కూడా అబ్దెల్ హమీద్ అక్కడే తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం లేదు. పట్టుబడ్డవారిని తమదైన శైలిలో విచారించిన పోలీసులు హమీద్ కూడా అక్కడే ఉన్నాడని నిర్ధారించుకుని ఆపరేషన్ ముమ్మరం చేశారు. చివరికి ఆ భవంతిలోకి దూసుకెళ్లి హమీద్ ను చుట్టుముట్టి, పెద్దగా శ్రమ లేకుండానే అతన్ని హతమార్చారని తెలుస్తోంది. ఇక దీంతో ఫ్రాన్స్ ప్రతీకారం తీరుతుందా? లేక గత మూడు రోజులుగా ఐఎస్ఐఎస్ రాజధాని రఖాపై జరుపుతున్న దాడులను కొనసాగిస్తుందా? అన్నది వేచి చూడాలి!