: దీని భావమేమి?... రాహుల్ గాంధీని స్వయంగా కలిసిన అరుణ్ జైట్లీ
భారత రాజకీయ నాయకులను ఆశ్చర్యపరిచే సంఘటన ఒకటి నేడు చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయన నివాసానికి వెళ్లి మరీ కలుసుకున్నారు. మరో ఐదు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న వేళ, కీలకమైన జీఎస్టీ బిల్లు, ఇటీవల ప్రకటించిన ఎఫ్డీఐ సంస్కరణలు తదితర అంశాలపై విపక్షాల మద్దతు కోరేందుకే ఆయన వెళ్లి వుంటారని కొందరి అంచనా. కాగా, వీరిద్దరూ సుమారు అరగంట పాటు కలిసే వున్నారు. తాము ఎందుకు కలుసుకున్నామో ఇరువురు నేతలూ వెల్లడించలేదు. జైట్లీని తన ఇంటి బయటకు వచ్చి మరీ సాదరంగా ఆహ్వానించిన రాహుల్, స్వయంగా లోపలికి తోడ్కొని వెళ్లారు. తదుపరి నెలలో తన కుమార్తె వివాహం ఉన్న కారణంగానే, రాహుల్ గాంధీని స్వయంగా ఆహ్వానించేందుకే ఆయన వెళ్లారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అరుణ్ జైట్లీ ఎందుకు రాహుల్ ఇంటికి వెళ్లినా వారిద్దరి కలయిక మాత్రం చర్చలకు దారితీసింది.