: మొబైల్ డేటా బిల్లు ఆదా చేసుకునేందుకు సులభ మార్గాలివే!
మీ స్మార్ట్ ఫోన్లలో డేటా ఎక్కువగా ఖర్చు అయిపోతోందా? వస్తున్న బిల్స్ మీ జేబుకు చిల్లు పెడుతున్నాయా? మొబైల్ డేటాను నియంత్రణలో ఉంచుకోవడానికి ఈ టిప్స్ పాటించి చూడండి. వైఫై అందుబాటులో ఉన్నప్పుడే యాప్స్ అప్ డేట్ చేసుకోండి: సెల్యులర్ డేటా ద్వారా యాప్స్ అప్ డేట్ చేసుకుంటే డేటా అధికంగా ఖర్చు అవుతుంది. అదే వైఫై ఉన్నప్పుడైతే మరింత వేగంగాను, సులువుగాను అప్ డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటో-అప్ డేట్ యాప్స్ ఓపెన్ చేసి 'ఆటో అప్ డేట్ యాప్స్ ఓవర్ వైఫై ఓన్లీ' ఆప్షన్ ఎంచుకోవాలి. సెట్టింగ్స్ / జనరల్ సెట్టింగ్స్ లో ఈ ఆప్షన్ ఉంటుంది. వైఫై అసిస్ట్ ను డిజేబుల్ చేసుకోవాలి: వైఫై రూటర్ల సంఖ్య పెరుగుతున్న వేళ, తక్కువ వైఫై సిగ్నల్ అందినా ఫోన్లు మొబైల్ డేటా వాడుతూ, వాటి గురించిన సమాచారాన్ని అందిస్తుంటాయి. దీన్ని నివారించేందుకు సెట్టింగ్స్ లోకి వెళ్లి వైఫై అసిస్ట్ ను డిజేబుల్ చేయాలి. డేటా కంప్రజన్: మొబైల్ బ్రౌజర్ ను కంప్రెస్ చేయడం ద్వారా డేటా వాడకం తగ్గించుకోవచ్చు. గూగుల్ క్రోం, ఒపేరా వంటి బ్రౌజర్లు ఈ సేవలను అందిస్తున్నాయి. వాట్స్ యాప్ మీడియా ఆటో డౌన్ లోడ్ ఆపాలి: వాట్స్ యాప్ వాడకం విస్తృతంగా పెరిగిపోయిన వేళ, మిత్రుల నుంచి వచ్చే అవసరం లేని ఇమేజ్, వీడియోలు డౌన్ లోడ్ చేసుకోకుండా ఆపుకుంటే ఎంతో డేటా సేవ్ అవుతుంది. వాట్స్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ / చాట్స్ అండ్ కాల్ / మీడియా సెట్టింగ్స్ లోకి వెళ్లి మీకు కావాల్సినట్టుగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. మెయిల్ సింకింగ్ ను ఆపాలి: ఏవైనా పెద్ద పెద్ద అటాచ్ మెంట్లతో మెయిల్స్ వచ్చినప్పుడు అధిక డేటా ఖర్చవుతుంది. దీన్ని ఆపేందుకు జీమెయిల్ యాప్ ఓపెన్ చేసి మెనూ / సెట్టింగ్స్ కు వెళ్లి, ఆప్షన్స్ మార్చుకోవచ్చు. వాడుతున్న యాప్స్ కు డేటా నియంత్రణ: మీరు అధికంగా వాడుతున్న యాప్స్ కు ఎంత డేటా ఖర్చు చేయాలన్న విషయం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. తీసుకున్న డేటా ప్యాక్ ను బట్టి అమేజాన్ కు ఎంత వాడాలి? బుక్ మై షోకు ఎంత వాడాలి? అన్నది మీరే నిర్ణయించుకోవచ్చు. ఆ డేటా అయిపోయిన తరువాత మీకు అప్ డేట్స్ రావు. అవసరమనుకుంటే అప్పుడు తిరిగి డేటా అవధులు పెంచుకునే సౌలభ్యమూ ఉంది. ఫేస్ బుక్, ట్విట్టర్ ల ఆటో ప్లే ఆపేయండి: ఇటీవల వచ్చిన ఈ ఆటో ప్లే సౌకర్యం కంప్యూటర్లలో బాగుంటుంది కానీ, స్మార్ట్ ఫోన్లలో ఎంబీల కొద్దీ డేటాను తినేస్తోంది. ఫేస్ బుక్ తిరగేస్తున్న వేళ, మిత్రులు పోస్ట్ చేసిన వీడియో స్క్రీన్ పైకి రాగానే ప్లే అవుతుంది. దీన్ని ఆపేందుకు వీడియో ఆటో ప్లే ఆప్షన్ కు వెళ్లి, 'నెవర్ ప్లే వీడియోస్ ఆటోమేటికల్లీ' అనే ఆప్షన్ ఎంచుకోవాలి. వీటితో పాటు అవసరం లేని పుష్ నోటిఫికేషన్స్ డిజేబుల్ చేయడం, డేటా యూసెజ్ ని ఎప్పటికప్పుడు పరిశీలించడం, అఫ్ లైన్ లో వాడకాన్ని పెంచుకోవడం ద్వారా మీ మొబైల్ డేటా వాడకాన్ని అదుపులో ఉంచుకొవచ్చు. ఈ టిప్స్ మీరూ ట్రై చేయండి!