: భారీ వర్షాలతో ఏపీ, తమిళనాడులకు తీవ్ర నష్టం వాటిల్లింది: వెంకయ్యనాయుడు
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వర్షాల కారణంగా నెల్లూరు-చెన్నై జాతీయ రహదారి 300 మీటర్ల మేర దెబ్బతిందని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోందని తెలిపారు. పంట నష్టంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించినట్టు చెప్పారు. వరద నష్టాలపై కేంద్రం సహాయం చేస్తుందని వెల్లడించారు. ఏపీ, తమిళనాడు లలో వర్షాల ప్రభావాన్ని ప్రధానికి వివరించామని వెంకయ్య చెప్పారు.