: నెల్లూరు జిల్లాను వీడని వరుణ గండం... జలదిగ్బంధంలో 150 గ్రామాలు, నేడూ పాఠశాలలకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీలోని నెల్లూరు జిల్లా అతలాకుతలమైంది. మిగతా జిల్లాల్లో కాస్తంత తగ్గుముఖం పట్టిన వర్షం నెల్లూరు జిల్లాను మాత్రం వీడలేదు. జిల్లాలోని 150కి పైగా గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నేటి ఉదయం కూడా ఈదురు గాలులతో కూడిన చిరు జల్లులు పడుతున్న నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్రంగా అంతరాయం కలుగుతోంది. సహాయ చర్యల్లో భాగంగా నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తెప్పించిన హెలికాఫ్టర్లు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో బోట్ల ద్వారానే బాధితులను రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. వర్ష ప్రభావం తగ్గని కారణంగా అధికారులు నేడు కూడా జిల్లావ్యాప్తంగా విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.