: కొత్త దంపతులను కాపాడిన టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి!
రోజుల తరబడి కురుస్తున్న వర్షం కారణంగా నెల్లూరు జిల్లాలో మెజారిటీ ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాక కోల్ కతా-చెన్నై జాతీయ రహదారి నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కోతకు గురైంది. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో జిల్లాలోని గూడూరు సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న ఓ కొత్త జంటను టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది కాపాడారు. జిల్లాలోని మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ వద్ద జాతీయ రహదారి వరద తాకిడికి కొట్టుకుపోయింది. అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు సోమిరెడ్డి నిన్న వెళ్లారు. అదే సమయంలో కొత్తగా పెళ్లి చేసుకుని నెల్లూరు నుంచి గూడూరు వెళుతున్న కొత్త దంపతులు రోడ్డుకు గండి పడిన ప్రదేశంలో చిక్కుకుపోయారు. పరిస్థితిని గమనించిన సోమిరెడ్డి అక్కడికక్కడే ఎన్డీఆర్ బృందాలతో మాట్లాడి బోట్లను తెప్పించారు. సోమిరెడ్ది ఆదేశాలతో బోట్లతో అక్కడికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొత్త దంపతులను కాపాడి, సురక్షితంగా గూడూరుకు చేర్చారు.