: చిత్తూరు మేయర్ భర్త మోహన్ మృతి!
ఈ రోజు ఉదయం దుండగుల దాడిలో గాయపడ్డ చిత్తూరు మేయర్ అనూరాధ భర్త మోహన్ మృతి చెందారు. వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. అరకంబాడి ప్రభుత్వాసుపత్రిలో మోహన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. మోహన్ దాదాపు పదిగంటల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచినట్లు వైద్యాధికారులు తెలిపారు. సుమారు రెండున్నర గంటలపాటు ఆపరేషన్ చేశామని, ఆయన శరీరం నుంచి ఒక బుల్లెట్ కూడా బయటకు తీశామన్నారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించామని వైద్యులు అన్నారు. కాగా, మోహన్ అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయన్న విషయమై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ఈ రోజు ఉదయం మేయర్ చాంబర్ లోకి వెళ్లిన దుండగులు తుపాకులతో కాల్పులు జరిపిన సంఘటనలో మేయర్ అనూరాధ అక్కడికక్కడే మృతి చెందారు. భర్త మోహన్ పై కత్తులతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే.