: నాకు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉంది: హాలీవుడ్ నటుడు చార్లీ షేన్ ప్రకటన
హాలీవుడ్ నటుడు చార్లీ షేన్ తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని మీడియా ముందు ఒప్పుకున్నాడు. దీంతో ఈ విషయంలో మీడియాలో వస్తున్న కథనాలకు తెరపడింది. మంగళవారం ఎన్బీసీ చానెల్ కు ఆయన ఇంటర్వ్యూ (ప్రత్యక్ష ప్రసారం) ఇచ్చారు. 'నాకు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉందని అంగీకరించడానికే ఇక్కడికి వచ్చాను’ అని ఆయన చెప్పారు. ఈ విషయమై వస్తున్న కథనాలకు చెక్ పెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఎన్‌బీసీ చానెల్‌లోని 'టుడే షో' కార్యక్రమంలో చార్లీషీన్ మాట్లాడుతూ, ‘దాదాపు నాలుగేళ్ల కిందట నాకు హెచ్‌ఐవీ సోకిందని తెలిసింది. అప్పటినుంచి చికిత్స పొందుతున్నాను. ప్రమాదకరమైన కథనాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకే వాస్తవాన్ని బయటపెడుతున్నాను’ అని పేర్కొన్నాడు. దీని బారిన పడిన తర్వాత మీ నుంచి ఎవరికైనా ఈ వ్యాధి సంక్రమించిందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, అటువంటిదేమి లేదన్నాడు. చార్లీ షీన్ ఆరోగ్యం గురించి ఆయన వైద్యుడు రాబర్ట్ హుజెంగా కూడా మాట్లాడారు. చార్లీ క్రమం తప్పకుండా చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం చార్లీ రక్తంలో హెచ్‌ఐవీ వైరస్ ఉనికి కనబడటం లేదని, ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. కాగా, మద్యం, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాల నుంచి బయటపడ్డ చార్లీ షీన్ టాప్ రేటెడ్ టీవీ సిరీస్ 'టు అండ్ హాఫ్ మెన్' కార్యక్రమంతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే వార్నర్ బ్రదర్స్‌తో బహిరంగంగా గొడవ పడటంతో 2011లో ఆయనను ఈ కార్యక్రమం నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయనకు హెచ్‌ఐవీ వ్యాధి సోకిందన్న విషయం బయటకు రావడంతో సంచలనం రేపింది. ఆయనతో లైంగిక సంబంధాలు ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ విషయమై ఆందోళన చెందారు.