: అశోక్ సింఘాల్... ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి కనుసైగతో శాసించే స్థాయి వరకు ఎదిగిన 'శక్తి'!


అశోక్ సింఘాల్... హిందూ మత పరిరక్షణకై అనుక్షణం తపించిన మహానేత. హిందుత్వ అనే మూడు అక్షరాల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. అనారోగ్య కారణాలతో ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. కోట్లాది హృదయాలను బాధలో ముంచి, తుది వీడ్కోలు తీసుకున్నారు. 1926 సెప్టెంబర్ 15వ తేదీన ఆగ్రాలో అశోక్ సింఘాల్ జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించేవారు. 1950లో ప్రఖ్యాత బెనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి మెటలర్జికల్ ఇంజినీరింగ్ లో సింఘాల్ పట్టా పుచ్చుకున్నారు. 1942 నుంచి ఆర్ఎస్ఎస్ లో ఉన్న సింఘాల్... ఇంజినీరింగ్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి ప్రచారక్ గా మారారు. ఈ క్రమంలో, ఉత్తరప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో ప్రచారక్ గా పనిచేశారు. అనంతరం ఢిల్లీ, హర్యాణాల్లో ప్రాంత్ ప్రచారక్ గా వ్యవహరించారు. 1980లో ఆర్ఎస్ఎస్ నుంచి వీహెచ్ పీ జాయింట్ జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. 1984లో జనరల్ సెక్రటరీగా, ఆ తర్వాత వీహెచ్ పీ అధినేతగా ఎదిగారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వీహెచ్ పీ అధినేతగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో హిందూ సమాజ రక్షణ కోసం ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. మరో విషయం ఏమిటంటే, పండిట్ ఓంకార్ నాథ్ ఠాకూర్ వద్ద ఆయన హిందుస్థానీ సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. 1981లో తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని మీనాక్షిపురంలో చోటు చేసుకున్న మత మార్పిడులు దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. అంటరానితనాన్ని భరించలేక ఆ గ్రామంలోని దాదాపు 800 మంది దళితులు హిందూ మతాన్ని వదిలేసి... ఇస్లాం మతాన్ని స్వీకరించారు. అప్పట్లో ఈ ఘటన ప్రకంపనలు పుట్టించింది. అనంతరం, ఆర్య సమాజ్, వీహెచ్ పీ, బీజేపీలకు చెందిన వాజ్ పేయి లాంటి నేతలు మీనాక్షిపురాన్ని సందర్శించి నచ్చజెప్పినా వారు మళ్లీ హిందూమతంలోకి మారలేదు. ఇలాంటి పరిస్థితుల్లో, 1984లో 'ధర్మ సంసద్' పేరుతో అశోక్ సింఘాల్ ఓ భారీ కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా సాధువులు, హిందూ మత ప్రముఖులు తరలి వచ్చారు. హిందూమతానికి పునర్వైభవం తీసుకువచ్చే అంశాలపై ఈ సదస్సులో మేధోమథనం జరిగింది. రామ జన్మభూమి అంశం ఈ చర్చల్లో నుంచి పుట్టిందే. తదనంతర కాలంలో అయోధ్య రామమందిర నిర్మాణం పోరాటానికి సింఘాల్ నాయకత్వం వహించారు. తద్వారా, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి సింఘాల్ ప్రధాన కారకుడయ్యారు. దశాబ్దాలుగా కేంద్రంలో అధికార పీఠంపై కూర్చున్న కాంగ్రెస్ కు దీటైన జాతీయ పార్టీగా బీజేపీ అవతరించడం వెనుక అశోక్ సింఘాల్ పాత్ర అత్యంత కీలకమైనది. బీజేపీని కనుసైగతో శాసించిన నేత సింఘాల్. అంతటి మహానేత ఈ రోజు గుర్గావ్ లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News