: మీరు నన్ను భయపెట్టలేరు: తీరని బాధలోనూ ధైర్యం చెబుతున్న 'పారిస్' బాధితుడు
పారిస్ ఉగ్రదాడుల్లో తన భార్యను కోల్పోయిన ఓ భర్త తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్టు లక్షలాది మందికి ధైర్యం నూరిపోస్తోంది. తన 17 నెలల బాబుతో ఒంటరిగా మిగిలిన ఆంటోనీ లీరిస్ సతీమణి బాటాక్లాన్ థియేటర్ వద్ద జరిపిన కాల్పుల్లో బలైంది. ఐఎస్ఐఎస్ తనను భయపెట్టలేదంటూ ఆయన పెట్టిన పోస్టింగ్ ను 57 వేల మంది షేర్ చేసుకున్నారు. తన భార్యకు నివాళిగా "శుక్రవారం రాత్రి మీరు నా నుంచి నా జీవితాన్ని దూరం చేశారు. నా భార్యను, నా బిడ్డకు తల్లిని నేనెంతో ప్రేమిస్తున్నాను. మీరెవరో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా నాకు లేదు. మీరంతా చచ్చినవాళ్లతో సమానం. మీరు నా భార్య శరీరంలో దింపిన ప్రతి బులెట్ ఆ దేవుడికి తగిలినదే. మీపై అసహ్యం కూడా కలగడం లేదు" అని తన బాధను వ్యక్తపరిచాడు. ఉగ్రవాదులు తనను భయపెట్టలేరని, ఇకపైనా తాను గతంలోలానే జీవించడానికి ప్రయత్నిస్తానని, తన భార్య తన పక్కనే ఉందని, 12 సంవత్సరాల నుంచి తను ఎంత అందంగా కనిపించేదో, ఇప్పుడూ అంతే అందంగా తన మనసులో ఉందని, ఆ స్థానం నుంచి ఆమెనెవరూ కదిలించలేరని అన్నాడు. ఉగ్రవాదులకు లభించింది చిన్న విజయం మాత్రమేనని అతను పెట్టిన పోస్టింగ్ సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మందికి చేరింది.