: మేయర్ అనురాధను ఎలా హత్య చేశారంటే...!
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ లపై పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగింది. కార్పొరేషన్ లో నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా మేయర్ కు పలువురు ఫిర్యాదులు, విజ్ఞాపన పత్రాలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ఐదుగురు వ్యక్తులు మేయర్ కు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని వచ్చారు. వీరిలో ఇద్దరు బురఖాలు ధరించగా, మిగిలిన వారు మామూలుగానే కార్యాలయంలోకి ఎంటర్ అయ్యారు. మేయర్ ఛాంబర్ లోకి రాగానే వెంటనే తుపాకితో కాల్పులు జరిపారు. మోహన్ పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అనురాధ అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు తుపాకుల శబ్దం వినిపించగానే, కార్యాలయంలో ఉన్న ప్రజలు, సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితుల్లో, తమను తాము రక్షించుకునే ప్రయత్నం చేశారు. దాడి పూర్తయిన వెంటనే దుండగులంతా పారిపోయారు. మరో విషయం ఏమిటంటే, ఈ దాడికి సంబంధించి అంతకుముందే పక్కాగా రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు.