: బయట వరద, ఇంట్లో కూలుతున్న గోడలు... చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి భీతావహం!
పచ్చటి పొలాలు, ఎర్రని సముద్రాలుగా మారిపోయాయి. చుక్క నీరు కూడా కనిపించని చిన్న చిన్న వాగులు, వంకలు, చెరువులు వరద నీటి హోరులో ప్రాణాంతకాలుగా మారాయి. గడచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తమిళనాడులోని పలు ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం కాగా, ప్రజలు అన్నం, నీరు లేక అలమటిస్తున్నారు. బయట కాలు పెట్టాలంటే వరదలో కొట్టుకుపోతామన్న భయం. ఇంట్లో తలదాచుకుందామంటే, నాలుగు రోజులుగా నీటికి నానిపోయిన గోడలు కూలుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో గోడలు కూలిన ఘటనల్లో ఎనిమిది మంది చనిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు విద్యుత్ సరఫరా లేక వేలాది గ్రామాలు అంధకారంలో మునిగాయి. సెల్ ఫోన్లలో చార్జింగ్ అయిపోయి, బయటేం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితి పల్లెల్లో నెలకొంది. రహదారులపై నిలిచిపోయిన వందల కొద్దీ వాహనాల్లోని వారు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. గత రెండు మూడు దశాబ్దాల్లో ఇంతటి ఘోరం ఎన్నడూ చూడలేదని ప్రజలంటున్నారు.