: సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న యువ ఐపీఎస్...నాలుగో అంతస్తు నుంచి దూకేసిన అధికారి భార్య
దేశ రాజధాని ఢిల్లీ పోలీసు విభాగంలోని స్పెషల్ సెల్ లో ఏసీపీ స్థాయి అధికారిగా పనిచేస్తున్న యువ ఐపీఎస్ అధికారి అమిత్ సింగ్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. భర్త శవాన్ని చూసిన ఆయన సతీమణి నాలుగో అంతస్తులోని తమ ఇంటి నుంచి కిందకు దూకేసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్న వీరికి 18 నెలల కుమార్తె కూడా ఉంది. మూడేళ్లుగా సాఫీగానే సాగిన వీరి సంసారంలో ఇటీవలే కలతలు రేగినట్లు సమాచారం. నిన్న రాత్రి ఏమైందో తెలియదు కానీ, అమిత్ సింగ్ తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. వెంటనే తన సర్వీస్ రివాల్వర్ తో తనను తాను కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దం విన్న ఆయన భార్య ఇరుగుపొరుగును పిలిచింది. భర్త శవం చూసిన వెంటనే ఆమె పరుగున వెళ్లి బాల్కనీలో నుంచి కిందకు దూకేసింది. వీరిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, అమిత్ సింగ్ అప్పటికే చనిపోయారు. ఆయన భార్య పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.