: జర్మనీలో ఆవిర్భవించిన 'మటా'... బాలకృష్ణ, కేటీఆర్ అభినందనలు... వేడుకగా దీపావళి సంబరాలు


మెరుగైన జీవితం కోసం జన్మభూమిని వీడి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లినా... మన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు తదితర అంశాలపై మాత్రం మన తెలుగు ఎన్నారైలు మక్కువ కోల్పోలేదు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా మన తెలుగుదనాన్ని, సంప్రదాయాలను బతికించుకోవడానికి, భవిష్యత్ తరాలకు వాటిని అందించడానికి వారు చేస్తున్న యజ్ఞం అనన్యసామాన్యమైనది. అనేక దేశాల్లో ఇప్పటికే మన తెలుగువారు వివిధ సంస్థలను ఏర్పాటు చేసుకుని, మన ఉనికిని చాటుతున్నారు. ఈ క్రమంలో జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో 'మన తెలుగు అసోసియేషన్ (MATA)' పేరిట కొత్త సంస్థ ఆవిర్భవించింది. ఈ నెల 15వ తేదీన దీపావళి సందర్భంగా జర్మనీలోని మన తెలుగువారు సంస్థ ఆవిర్భావ ఉత్సవాలను, దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కేవలం మ్యూనిచ్ నగరంలోని వారే కాకుండా, జర్మనీలోని ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా ఈ వేడుకకు తరలివచ్చారు. వందలాది తెలుగువారి సమక్షంలో జరిగిన వేడుకలు అదరహో అనిపించాయి. ఈ కార్యక్రమానికి భారత కన్సులేట్ జనరల్ తరపున విచ్చేసిన వీఎస్డీఎల్ సురేంద్ర MATA లోగో, వెబ్ సైట్ (www.matagermany.com)లను ఆవిష్కరించి, ప్రసంగించారు. మరోవైపు, ప్రముఖ సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీఎస్ మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారిలతో పాటు పలువురు సినీనటులు ఇంటర్నెట్ ద్వారా వేదికపై అమర్చిన తెర ద్వారా తమ శుభాభినందనలను, సందేశాలను తెలియజేశారు. జర్మనీలోని తెలుగు ప్రజల సంక్షేమానికి MATA పాటు పడాలని వీరంతా ఆకాంక్షించారు. వీరితో పాటు యూరప్ లో ఉన్న పలు తెలుగు సంఘాలు MATAకు అభినందనలను తెలిపాయి. అనంతరం ప్రదర్శింపబడ్డ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గాయకురాలు గీతా మాధురి, శ్రీనివాసశర్మల సంగీత విభావరి అలరించింది. ఈ సందర్భంగా ఆడిటోరియం మొత్తం ప్రేక్షకుల నృత్యాలతో హోరెత్తింది. మరోవైపు, MATA సభ్యులు తమ స్వహస్తాలతో తయారుచేసిన కమ్మటి తెలుగు వంటకాలు అందరికీ సొంతింటి భోజన అనుభూతిని కలిగించాయి. కార్యక్రమం చివరలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ బాణాసంచా కాల్చి దీపావళి వేడుకను ఘనంగా జరుపుకున్నారు. MATA కార్యవర్గ సభ్యులు వీరే... ప్రెసిడెంట్ - నిశాంకర ప్రణీత్ వైస్ ప్రెసిడెంట్ - కూచర్లపాటి రామకృష్ణంరాజు జనరల్ సెక్రటరీ - రామిశెట్టి క్రాంతికిరణ్ జాయింట్ సెక్రటరీ - ఎల్లా పనసరామకృష్ణ ట్రెజరర్ - మేసినేని నరేష్ జాయింట్ ట్రెజరర్ - కాకుమాను కమల్ మేనేజింగ్ కోఆర్డినేటర్ - మత్తి శివప్రసాద్

  • Loading...

More Telugu News