: నెల్లూరు నుంచి కదిలితే 'పైకే' పోవాలి!
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడుతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు పూర్తిగాను, అనంతపురం, కడప జిల్లాలు పాక్షికంగాను దెబ్బతినగా, జాతీయ రహదారులు చాలా చోట్ల కొట్టుకుపోయాయి. పలు చోట్ల వరద నీటి ప్రవాహాన్ని తరలించేందుకు అధికారులు, ప్రజలు దగ్గరుండి రోడ్లకు గండ్లు కొట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినగా, ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఒక్క బస్సు, లారీ, కనీసం ఆటో కూడా తిరగలేని పరిస్థితి నెలకొంది. నాయుడు పేట సమీపంలో నిన్నటి నుంచి రోడ్డుపై చాలా చోట్ల మూడు నుంచి నాలుగడుగుల మేరకు నీరు చేరడం, హైవే కింద మట్టి కొట్టుకుపోవడంతో అధికారులు వాహనాలను కదలనీయడం లేదు. ఇక వెంకటగిరి - తిరుపతి మార్గంలో ఎన్నో వాగులు రోడ్లపైకి చేరాయి. వందలాది చెరువులకు గండ్లు పడ్డాయి. నెల్లూరు - వింజమూరు రహదారి ఏకంగా సముద్రాన్ని తలపిస్తోంది. గూడూరు - డెక్కలి మార్గం వరదనీటికి పూర్తిగా కొట్టుకుపోగా, తిరిగి నిర్మించాల్సిన పరిస్థితి. నెల్లూరు మీదుగా వెళ్లాల్సిన ఎన్నో రైళ్లు రద్దు కాగా, త్రివేండ్రం, కన్యాకుమారి తదితర దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను గుంటూరు, దొనకొండ, నంద్యాల, గుత్తి మీదుగా మళ్లించారు. దీంతో నెల్లూరు నుంచి తమిళనాడుకు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయినట్లయింది. వెళితే ఉత్తరంవైపున ఉన్న ఒంగోలు రావడానికి మాత్రమే వీలుంది. నెల్లూరు ప్రజలు పై ప్రాంతాలకే తప్ప కిందకు వెళ్లలేని పరిస్థితిలో ఉంటే, చిత్తూరు వాసులు మాత్రం ఎటూ కదల్లేకుండా ఉన్నారు.