: ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయిన ‘అమ్మ’ కాన్వాయ్ !
తమిళనాడులో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు కూడా సోమవారం నాడు కొంత ఇబ్బంది ఎదురైంది. తన సొంత నియోజకవర్గమైన రాధాకృష్ణ నగర్‌లో పర్యటించేందుకు వెళుతున్న సమయంలో ఆమె కాన్వాయ్ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయింది. దీంతో, ఆమె కొంత అసౌకర్యానికి గురయ్యారు. కాగా, ప్రజలకు సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం జయలలిత బాధిత ప్రజలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. ‘ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు. మిమ్మల్ని ఆదుకోవడానికి నేను ఉన్నాను’ అంటూ ఆమె పేర్కొన్నట్లు అన్నాడీఎంకే ట్విట్టర్‌లో తెలిపింది.