: చేజేతులా ఉగ్రవాదిని వదిలేసిన ఫ్రాన్స్ పోలీసులు!
తమకు పట్టుబడిన ఉగ్రవాదిని ప్రశ్నించి మరీ వదిలేశారు ఫ్రాన్స్ పోలీసులు. ఇప్పుడు అదే వ్యక్తి గురించి దాదాపు ఐదు దేశాలు జల్లెడ పడుతున్నాయి. అతని పేరే సలేహ్ అబ్దెస్లాం సలా. ఫ్రాన్స్ దాడుల వెనుక సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తి. అసలేం జరిగిందో ఇంకాస్త వివరంగా తెలుసుకుంటే... పారిస్ పై భీకర ఉగ్ర దాడి జరిగిన రెండు మూడు గంటల తరువాత, అప్పటికింకా భద్రతా దళాలు తేరుకోలేదు. బెల్జియం, ఫ్రాన్స్ సరిహద్దుల్లోకి ఓ వోక్స్ వాగన్ పోలో కారు ముగ్గురు వ్యక్తులతో వచ్చి ఆగింది. సరిహద్దుల్లో పహారా ఉన్న పోలీసులు వారిని కారు దిగమన్నారు. ఆపై వివరాలడిగారు. పలు ప్రశ్నలు వేసి వారిని వెళ్లనిచ్చారు. ఇదంతా వీడియోలో రికార్డయింది కూడా. ఆపై సరిహద్దుల మూసివేత, కఠిన నిబంధనల అమలు ప్రారంభమైంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా, సలా వివరాలు తెలిశాయి. ఆపై కాసేపటికి అతను తప్పించుకున్నాడని కూడా తెలిసిపోయింది. ఫ్రాన్స్ పోలీసులు దగ్గరుండి అతడిని వెళ్లనిచ్చారు. సలాను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నిస్తే, అందుకు సమాధానం ఫ్రాన్స్ పోలీసుల వద్ద లేదు. అతనిపై ఎటువంటి లుకౌట్ నోటీసూ లేకపోడవం వల్లే అనుమానించలేకపోయామని సరిహద్దుల్లో పహారా కాస్తున్న అధికారి ఒకరు తెలిపారు. ఇక ఇప్పుడు చేసేదేమీ లేక సలా కోసం పలు యూరప్ దేశాలు వెతుకులాట మొదలు పెట్టాయి.