: ‘పాక్’ ప్రధాని తీరు చాలా సిగ్గుచేటు : కాంగ్రెస్ నేత ఆరోపణలు


కాశ్మీర్ లోయలోని వేర్పాటువాదులను పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత షకీల్ అహ్మద్ ఆరోపించారు. వేర్పాటువాదుల నేత అసియా ఆంద్రాబిని ప్రశంసిస్తూ నవాజ్ రాసిన లేఖే ఇందుకు నిదర్శనమన్నారు. భారత్ కు చెందిన ఒక న్యూస్ ఏజెన్సీతో సోమవారం ఆయన మాట్లాడారు. ‘పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఈ విధంగా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటైన విషయం. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న సిమ్లా ఒప్పందాన్ని ఆయన పక్కనబెడుతున్నారు. మన దేశంలోని వేర్పాటు వాదులను ఒక పరాయిదేశపు ప్రధానమంత్రి ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదు’ అని షకీల్ అహ్మద్ మండిపడ్డారు. కాశ్మీర్ అంశాన్ని ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ తన పోరాటాన్ని కొనసాగిస్తున్న అసియా ఆంద్రాబిని ప్రశంసిస్తున్నానని, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించేందుకు తన ప్రయత్నాలు నిరంతరం కొనసాగిస్తానంటూ నవాజ్ షరీఫ్ ఆ లేఖలో పేర్కొన్నట్లు పాకిస్తాన్ పత్రిక పేర్కొంది. అంతేకాకుండా, అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన మాటపై భారత్ నిలబడటం లేదని షరీఫ్ ఆరోపించినట్లు ఆ పత్రికలో రాసింది.

  • Loading...

More Telugu News