: ఆనం సోదరుల వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తుంది: శైలజానాథ్
కాంగ్రెస్ నేతలు ఆనం రాంనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి ఇటీవల పార్టీపై విమర్శలు చేయడం, వారు పార్టీ మారుతున్నారంటూ వార్తలు రావడంపై ఆ పార్టీ నేత శైలజానాథ్ మాట్లాడారు. వారు పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను తాను కూడా పత్రికల్లో చూశానన్నారు. ఆనం సోదరుల వ్యాఖ్యలను పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. అయితే వారిద్దరూ పార్టీ వీడతారని అనుకోవడం లేదని హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ శైలజానాథ్ అన్నారు. ఇదే సమయంలో టీడీపీ ప్రజా చైతన్య యాత్రలపై విమర్శలు చేశారు. అవి చైతన్య యాత్రలు కాదని... ఫెయిల్యూర్ యాత్రలని విమర్శించారు. తామడిగే 50 ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఒకటి చెప్పి, తీరా చూస్తే మరొకటి చేస్తున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.