: ఐఎస్ఐఎస్ దాడి చేయాలనుకుంటే ఆపే శక్తి ఎవరికీ లేదు... ఎందుకంటే...!


వారి లక్ష్యం ఒకటే. సామాన్యులను చంపాలి. వీలైనంత ఎక్కువ మందిని పొట్టన బెట్టుకోవాలి. ఆపై తనను తాను పేల్చేసుకుంటూ మరింత మందిని బలిగొనాలి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యం అదే. వారు నిస్సహాయులు, చేతుల్లో ఆయుధాలు లేని వారిని, ప్రార్థనా మందిరాలను, హోటళ్లను, జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని విరుచుకుపడతారు. చావుకు తెగించి, తనకు తాను మరణానికి సిద్ధమై వచ్చి దాడులు జరిపే వారిని ఏ శక్తి అడ్డుకోగలదు? ఈ నెల 12న బీరూట్ లో ఐఎస్ఐఎస్ సూసైడ్ బాంబర్లు 43 మందిని, 13వ తేదీన బాగ్దాద్ లో 26 మంది ప్రాణాలను హరించారు. ఆ వెంటనే పారిస్ పై విరుచుకుపడ్డారు. ప్రజల మధ్య ప్రజల మాదిరిగా తిరుగుతూ జరిపే ఈ దాడులను ఆపడం అసాధ్యమంటున్నాయి భద్రతా దళాలు. తమ లక్ష్యాన్ని చేరే మార్గంలో తమను తాము అంతం చేసుకునే బాంబర్లను వెతకడం సంభవం కాదన్నది వారి వాదన. సిరియాలో దాడులు చేస్తున్నందునే ఫ్రాన్స్ పై దాడి చేశామని ఐఎస్ఐఎస్ చెబుతున్నా, వాస్తవ కారణాలు వేరే ఉండవచ్చు. ఎందుకంటే సిరియాపై రష్యా, అమెరికా వంటి ఎన్నో దేశాలు విమానాలతో దాడులు చేస్తున్నాయి. అయితే, ఫ్రాన్స్ దగ్గరగా ఉండటం, అమెరికా, రష్యా దేశాల్లో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ తక్కువగా ఉండటంతోనే ఐఎస్ఐఎస్ పారిస్ ను ఎంచుకుని ఉండవచ్చు. దాడుల వెనుక ఉగ్రవాద నెట్ వర్క్ అపారమైన తెలివిని ప్రదర్శించిందని కూడా తెలుస్తోంది. ఉగ్రవాదుల రిక్రూటింగ్, వారికి ఆయుధాలు పంపడం, సమన్వయంతో వారిని దాడులకు పురిగొల్పడం, చివరి నిమిషం వరకూ వారిపై అనుమానం రాకుండా చూడటం వంటివి రహస్యంగా నిర్వహిస్తూ రావడం ఫ్రాన్స్ వంటి అత్యుత్తమ పోలీసు వ్యవస్థ ఉన్న దేశాల్లో అంత సులభమేమీ కాదు. గాల్లో వెళుతున్న ఓ విమానాన్ని కూడా పేల్చే శక్తి ఉగ్రవాదులకు ఉందంటే, గత నాలుగైదేళ్లలో వాళ్లెంతగా ఎదిగారన్నది తెలుస్తోంది. ఇక ఎటువైపు నుంచి ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో తెలియని ఉగ్రదాడుల ప్రమాద భయాలను అడ్డుకోవడం ఎలా? అగ్రరాజ్యాల మదిని దోచేస్తున్న ప్రశ్న ఇదే. సిరియా మొత్తాన్ని తుదముట్టిస్తే ఈ మారణ హోమం ఆగుతుందా? అమాయకుల ప్రాణాలు బలైతే సమాధానం చెప్పేదెవరు? తదుపరి ఐఎస్ఐఎస్ టార్గెట్ ఏది? వాషింగ్టన్, లండన్, రోమ్ లేదా న్యూఢిల్లీ... ఎక్కడ, ఎప్పుడు దాడి జరిగినా, దాన్ని ముందుగా అడ్డుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. అత్యుత్తమ టెక్నాలజీ అందుబాటులో ఉన్న వేళ ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే. అంతకన్నా ముందు జీ-20లో ప్రధాని మోదీ చెప్పినట్టుగా వారికి ఇంటర్నెట్ వంటి సాంకేతికత అందకుండా చేసి, బయటి దేశాల నుంచి అందే నిధులను ఆపగలిగితే కాస్తంత ప్రయోజనం ఉండవచ్చు.

  • Loading...

More Telugu News