: ఆన్ లైన్లో కొంటే అదనపు బాదుడు... తెలంగాణలో మాత్రమే సుమా!
రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే సంస్థలకు, ముఖ్యంగా ఐటీ కంపెనీలకు స్నేహపూర్వకంగా ఉందన్న తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. తయారీదారుల నుంచి వినియోగదారులకు మార్కెట్ రేటుతో పోలిస్తే తగ్గింపు ధరలకు పలు రకాల ప్రొడక్టులను అందిస్తున్న ఈ-కామర్స్ కంపెనీలపై కేసీఆర్ సర్కారు పన్ను విధించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలో భారీ గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్న ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తదితర సంస్థలకు భారీ నష్టమే. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న ఈ వివాదాస్పద పన్నుపై రాష్ట్ర వాణిజ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. "అన్ని రకాల ఆన్ లైన్ లావాదేవీలను పరిశీలించేందుకు తగిన విధానాన్ని రూపొందించాలని చూస్తున్నాం. కామన్ సర్వర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉంది. పన్ను పరిధి నుంచి ఎవరూ తప్పించుకోకుండా చూడాలన్నది మా ఉద్దేశం" అని ఆయన అనడం కొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుత పన్ను వసూలు విధానంలో 'లూప్ హోల్స్' ఉన్నాయని, వాటిని వాడుకుంటూ కొందరు డబ్బు సంపాదిస్తున్నారని తలసాని అభిప్రాయపడ్డారు. ఎంతో మంది ట్రేడర్లు, పెద్ద పెద్ద కంపెనీలు పన్నులు చెల్లించకుండా వ్యాపారాన్ని చేసుకుంటున్నాయని అన్నారు. "టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం, అయితే, ఈ విధానంలో కూడా నియంత్రణ తప్పనిసరి, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదు. మరో వారంలో కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తాం" అని వివరించారు. ఇప్పటికే ఈ-కామర్స్ కంపెనీలపై కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల్లో అమలవుతున్న విధానాన్ని ఇక్కడ కూడా పాటించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా వాణిజ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆయా రాష్ట్రాల్లో ఒక శాతం పన్నును ఈ-కామర్స్ కంపెనీలపై విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పన్ను భారాన్ని తట్టుకోలేకనే ఫ్లిప్ కార్ట్ వంటి దిగ్గజాలు తెలంగాణలో గిడ్డంగులు ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడిక పన్నులను ఇక్కడ కూడా విధిస్తే, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరిస్తున్న వారూ ఉన్నారు. "కొత్త పన్నుల విషయమై కమర్షియల్ టాక్స్ విభాగం నుంచి వచ్చే నివేదిక కోసం వేచి చూస్తున్నాం. ఆ తరువాతే ఈ-కామర్స్ ఇండస్ట్రీని కూడా పన్నుల పరిధిలోకి తీసుకువస్తాం. ఆ విధివిధానాలకు త్వరలో రూపకల్పన జరుగుతుంది" అని ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వ్యాఖ్యానించారు. అయితే, కంపెనీలను సంప్రదించిన తరువాతనే తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఏపీలో మాత్రం ఆన్ లైన్ కంపెనీల లావాదేవీలపై ఎటువంటి పన్నూ లేదన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆ రాష్ట్రం ఈ-కామర్స్ పన్నులపై ఆలోచించడం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రం కొత్త పన్నులు విధించడం ప్రారంభిస్తే, ఏపీలో కాస్త తక్కువ ధరకు, తెలంగాణలో కాస్త ఎక్కువ ధర పెట్టి ఆన్ లైన్లో వస్తువులను కొనాల్సి వుంటుంది.