: ఇతడే ఉగ్రవాదంటూ సిక్కు యువకుడి చిత్రం... ఫొటోషాప్ మాయతో బురిడీ!
ఉగ్రవాదులను, వారి ఫాలోవర్లను అరెస్ట్ చేసేందుకు పలు దేశాల భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ, వారిని మాయ చేసేందుకు అబ్దులత్ అనే వ్యక్తి 'బ్రేకింగ్' పేరిట సామాజిక మాధ్యమాల్లో పెట్టిన చిత్రం హల్ చల్ చేసింది. ఇతనే ఉగ్రవాది అంటూ, ఓ సిక్కు యువకుడి ఫోటోను మార్ఫింగ్ చేసి అందులో ఉంచాడు. బెల్ట్ బాంబులు కట్టుకుని, చేతిలో ఖురాన్ తో నిలబడ్డ ఆ యువకుడి చిత్రం కొన్ని వేల సార్లు షేర్ అయింది కూడా. ఇతను ఇస్లాం మతం పుచ్చుకున్న సిక్కు యువకుడని కూడా క్యాప్షన్ పెట్టాడు. అది అలా అలా తిరుగుతూ, సదరు యువకుడిని కూడా చేరింది. దీంతో అతను అవాక్కవ్వాల్సిన పరిస్థితి. ఆ వెంటనే తన పేరు వీరేంద్ర జుబ్బాల్ అని, కెనడా వాసినని, తన చేతిలో ఉన్నది ల్యాప్ టాప్ అయితే, దాన్ని ఖురాన్ గా మార్చి ఒంటిపై బెల్టు బాంబుల జాకెట్ ను ఫోటో షాప్ సాయంతో తగిలించారని ఒరిజినల్ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు. తాను ఒక్కసారి కూడా పారిస్ వెళ్లలేదని స్పష్టం చేశాడు. స్వయంగా కెనడా పోలీసులను సంప్రదించి విషయం తెలిపాడు. ఆ చిత్రాలు ఇవే. పైన ఉన్నది నకిలీ చిత్రమైతే, కింద ఉన్నది అసలు చిత్రం. ఇప్పుడు పోలీసులు ఆ మార్ఫింగ్ వీరుడిని గుర్తించేందుకు కదిలారు.