: అతడేస్తే బంతి కాదు, బులెట్టే!
ఆసీసీ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ బంతి విసిరే వేగంలో సరికొత్త వరల్డ్ రికార్డుకు చేరువయ్యాడు. పెర్త్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు, మూడవ రోజున స్టార్క్ 160 కి.మీ బౌలింగ్ స్పీడును దాటేశాడు. 21వ ఓవర్ నాలుగో బంతిని 160.4 కి.మీ వేగంతో విసిరాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఈ ఫీట్ ను అందుకోగలిగింది ఐదుగురు మాత్రమే. అయితే, టెస్టుల్లో మాత్రం స్టార్క్ వేసిన ఈ బాలే అత్యంత వేగవంతమైనది. గతంలో వన్డేల్లో పాక్ బౌలర్ షోయబ్ అక్తర్ 161.3 కి.మీ వేగంతో బంతి విసిరి మొదటి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా బౌలర్లు షాన్ టైట్, బ్రెట్ లీ, జెఫ్ థామ్సన్ లు కూడా 160 కి.మీ మించిన వేగంతో బంతులు విసిరారు. ఇప్పుడు స్టార్క్ ఈ జాబితాలో చేరాడు. మరో కిలోమీటరు వేగం పెంచగలిగితే, స్టార్క్ సరికొత్త వరల్డ్ రికార్డు హోల్డర్ అవుతాడు.